Skip to main content

దళిత సాహత్యానికి పుష్టి చేకూర్చిన 'మాదిగ' సాహిత్యం

తెలుగు సాహిత్యంలో గుర్రంజాశోవ మహాకవితో దళితసాహిత్యవాదం పునాదులు వేసుకొని కారంచెడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ లాంటి సంఘటనలతో చైతన్యమై మరింత ఊపునందుకొని అస్థిత్వ ఉద్యమాల ఉప్పెనలో ప్రస్తుతం పరిపుష్ఠిని అందుకొంటున్నది. దళితులు తమపై కుల, ధన, భాస్వామ్యపెత్తందార్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాహిత్యంలో తిరుగుబాటు స్వరాల(గొంతులు)ను చాలా గంభీరంగా వినిపించారు. తెలుగులో దళిత సాహిత్యకారులపై ప్రారంభంలోకాకపోయిన 80వ దశకంలో ప్రధానంగా కమ్యూనిస్టు దళితపాంథర్స్‌ ఉద్యమాల ప్రభావం గాఢంగా ఉంది. గుర్రం జాషువా, బోయభీమన్న, కుసుమ ధర్మన్న వంటి మొదటితరం కవులు పద్య, గేయ సాహిత్యాలలో ఎక్కువ కృషి చేస్తే, రెండవతరం దళిత సాహితీ కారులైన డాక్టర్‌ కొలకలూరి ఇనాక్‌, డాక్టర్‌ బోయ జంగయ్య, మాస్టర్జీ, డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌, మద్దూరి నగేష్‌ మొదలైన కవులు అన్ని సాహిత్య ప్రక్రియలలో తమగొంతును బలంగా వినిపిం చారు. ఆ తరువాత గత రెండు దశాబ్దాలుగా మాదిగ సాహిత్యకారులు సామాజికన్యాయ పునాదులపై గొంతెత్తి నినదిస్తూ విస్తృతంగా రచనలు చేశారు. మొత్తం సాహిత్యంపై తమదైన ముద్రను ప్రస్ఫుటంగా వేశారు. ఈ దశలో డాక్టర్‌ నాగప్పగారి సుందర్‌రాజు, గుండెడప్పు కనకయ్య, కదిరె కృష్ణ, దార్ల వెంకటేశ్వరరావు, జూపాక సుభద్ర, గోగుశ్యామల, మేరీమాదిగ, గ్యారయాదయ్య, వేముల ఎల్లయ్య, జాజుల గౌరి మొదలైనవారు మాదిగ సాహిత్య సృజనతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు.
మాదిగ జీవితంలోని ఆచార, సంప్రదాయాలు, కుటుంబజీవనం, సాంఘిక జీవనం మొదలుకొని దండోరా (వర్గీకరణ) ఉద్యమం వరకు అన్ని కోణాలను సృశించడంతో పాటు మరోపక్క మనువాదులపై తిరుగుబాటు సాహిత్యాన్ని సృష్టించి బృహత్తరమైన పాత్రను పోషించారు. డప్పు, చెప్పు, గూటం, తంగెడిచెక్క, లంద వంటి వృత్తిపరమైన పదప్రయోగ వైచిత్రితో భాషకు మరింత అందాన్ని చేకూర్చారు.
'సిందామె' కవితా శీర్షికలో 'చిత్రం ప్రసాద్‌'
''ఎదపిడిసై-ఎన్నుడొక్కిన బాధ కాయగాసి
గూడు కట్టిన నీలు ములుగు ఎన్ని పొలిమేర్లు దాటితే ఎవడికేం'' అంటూ
మాదిగల్లోని ఉపకులమైన చిందుమాదిగ మహిళ బాధలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తాడు.
''పుచ్చిబుర్రలవుతున్న బుద్ధి'' కవితా శీర్షికలో -గోగుశ్యామల
'' అవసరం ఖచ్చితంగా అనివార్యమైతది గాదె...
గందుకే అంబేద్కరును ఆగం బట్టియ్యకండి
సామాజిక న్యాయాన్ని ఏట్ల ముంచకండి
మేమెంతమందిమో మాకంత వాటా అని
ఉమ్మడి పోరాడుండె.....హే....'' అంటూ సామాజిక న్యాయ సూత్రాల మౌళిక భావనను వ్యక్తీకరించారు.
'' నా చూపుడు వేలుకు గుచ్చుకున్న ఆరె చూపెడుతున్న...
అయినా నాలుగు శతాబ్దాల నా నగరం నన్ను గుర్తించలేదు'' అంటూ నాగప్పగారి సుందర్‌రాజు ఒక ఐడిండిటి క్రైసీస్‌ను మన ముందుంచుతాడు.
అనఘా!...ఓ మాదిగ ...! అనే కవితా శీర్షికలో
చంద్రుడా నీకో తోలుపోగు
ఎందుకంత గనంగ జూస్తున్నవ్‌
మతలబేందో జరజెప్పు
కుట్టిస్తా ముగ్ధమనోహర
కిర్రుచెప్పు-అంటూ శిల్ప నైపుణ్యంతో కదిరె కృష్ణ తన కవితలో చమత్కరించాడు.
''మేము బతికి చెడినవాళ్లమేగానీ చెరిపి బతికినోళ్లం కాము'' అని ఎండ్లూరి సుధాకర్‌ తన 'వర్గీకరణీయం'లో మాదిగల గొప్పతనాన్ని వర్ణించారు.
'' పేటెంటు హక్కులే వచ్చి ఉంటే
మా పాదుకలకి
ప్రపంచ పట్టాభిషేకం జరిగి ఉండేది'' అని ఎండ్లూరి మాటలు మాదిగల వృత్తి అయిన చెప్పులు కుట్టడం ప్రపంచ తలమానికమైందని తెలియ జేస్తాయి.
మాదిగ దండోరా రాజకీయ ఉద్యమంలో ఉవ్వెత్తున లేచిన మాదిగ సాహిత్యం ఎన్నో సంకలనాలు వెలువరించింది. ముఖ్యంగా ''దండోరా దరువు'', ''నల్లరేగడి సాల్లు'' ముఖ్యమైనవి. దండోరా దరువు కవితా సంకలనంలో నూటాయాభైకి పైగా రచయితలు మాదిగ జీవితాన్ని సర్వస్వాలని తెరమీదికి తీసుకురావడంతో పాటు సామాజిక న్యాయాన్ని చర్చకు పెట్టారు. 'నల్లరేగడి సాల్లు' కథల సంకలనం శ్రమైకజీవన సౌందర్యానికి ఆద్యులుగా మాదిగ, మాదిగ ఉపకులాల పాత్రను విజయవంతంగా ప్రదర్శించింది. ఇటీవల ''కైతునకల దండెం'' విలక్షణమైన సంకలనం.
మాదిగ సాహిత్యంలో మాదిగేతర కవుల పాత్రేమీ తక్కువ కాదు. ప్రొ.ననుమాస స్వామి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కవితా సంకలనాలు వెలువడ్డాయి. డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి వంటి మహౌన్నత సాహితీ వేత్తలు సహితం చెప్పులు తిరగబడుతున్నాయంటూ కవిత్వంరాయక తప్పలేదు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలన్నింటికంటే ఈ విషయంలో ఎక్కువ పాత్రను పోషించింది.
తాళ్లూరి లాబన్‌బాబు 'మాదిగవారి చరిత్ర' రాయడం ఈ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. నవలలు, 'సర్కారుగడ్డి', 'కక్క' వంటి మాదిగ జీవిత నేపథ్యంగా వెలువడినవే. మిగతా అస్తిత్వ సాహిత్యాలకు మాదిగ సాహిత్యం ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు బ్రాహ్మణీయ మనువాద సంస్కృతిని ధిక్కరించింది. మరోవైపు మాదిగల జీవన సంస్కృతులను రికార్డు చేయడం మాదిగ సాహిత్యపు విశిష్టత.
ఒక ఆదివాస్తవిక జీవిత చిత్రణ, ఆ కవిత్వ పోకడలు ఆధునీకీకరణలో సాంఘిక విలువల విధ్వంసం, ప్రపంచీకరణలో మాదిగ బతుకుల చిత్రణ, శ్రమదోపిడి, కులాల అంతరాలను సబ్‌ క్యాస్ట్‌ కన్స్‌సీయస్‌నెస్‌ లాంటి ఎన్నో దృశ్యభావన చిత్రణలు మాదిగ కవిత్వంలో మనకు దృగ్గోచరం అవుతాయి. తెలుగు సాహిత్యంలో ఆధిపత్య ధోరణుల కొమ్ములు విరిచి సర్వమానవ సమా నత్వాన్ని ప్రతిపాదించినవానిలో మాదిగ సాహిత్యం అగ్రగామిగా నిలుస్తుంది. ఇంకా విభిన్న కోణాల్లో మాదిగ సంస్కృతి, నాగరికత, జీవిత చిత్రణలపై మరింత పరిశోధన జరుగవలసి ఉన్నది.
నవీన పోకడలకు నామంపెట్టే, ప్రాచీన పోకడలకు ప్రాణంపోసే మనువాద సంస్కృతికి ప్రత్యామ్నాయం నిర్మిస్తున్న మాదిగ సాహిత్యకారులు ఎట్లయినా అభినందనీయులు.


Comments

Popular posts from this blog

‘మాదిగ’జాతి గొప్పదనం - జాగో

తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను....

చిందు భాగవతులు

మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం.. చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు. యక్షగానం లేక చిందు...

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక – పెరుగుదల

క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు. ౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్...