దళితులు అంటరానివారు, బ్రాహ్మణులు పవిత్రులనే వ్యూహాన్ని అగ్రకులాలవారు అమలు చేస్తూ వెనుకబడిన కులాలవారిని అణచివేస్తున్నారు. ప్రజల మెదళ్లలో బ్రాహ్మణులు పవిత్రులనే ఆలోచనలు మరింత ఎక్కువ చేసేందుకు పుణ్యం పేరుతో ప్రజాప్రతినిధులు విచక్షణలేని పనులతో వివాదస్పదమవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, చినజీయర్ పాదాలపై పడి దీవెనలు తీసుకున్నారు. ఆయనకంటే రెండాకులు ఎక్కువే చదివారు జహీరాబాద్ ఎంపి బివి పాటిల్. నిజామాబాద్ జిల్లా కందకుర్తి పుష్కరఘాట్ లో పాటిల్ దంపతుల నెత్తిమీద కాళ్లు పెట్టి మరీ కేదారపీఠం, రంభపురి పీఠాధిపతులు ఆశీర్వదించారు. సమాజంలో దళితులకు అంత ప్రాధాన్యతలేదనే ఆధిపత్యకులాల ఆలోచనలకు బలం చేకూరేలా దళితుపై జరిగిన అమానుష ఘటనలకు సత్వర న్యాయం అందటం లేదు. ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మాదిగలపై కొనసాగుతున్న అణచివేతే రుజువు చేస్తుంది. బోయ, మాదిగ పేద కుటుంబాలే పాతపల్లి గ్రామంలో ఉన్నాయి. వీరితో పాటు పది రెడ్డి కుటుంబాలున్నాయి. రెడ్డి కుటుంబాలు వేరేగా నివసిస్తుంటే బోయలు బోయవాడలోనూ మాదిగలు ఊరికి వెలిగా మాదిగవాడలో నివసిస్తున్నారు.
పాతపల్లి గ్రామంలో మాదిగ కులానికి చెందిన ఆర్టిసి బస్సు కండక్టర్ రఘురాం సరస్వతిల వివాహం జరిగింది. ఈ పెళ్లి ఫంక్షన్ కు హాజరైన స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో దేవాలయ ప్రవేశం చేయాలనే వారి కోరిక నెరవేరలేదు. అగ్రకుల బ్రాహ్మణ, మనువాద కులవ్యవస్థ కట్టుబాట్లను చేధిస్తూ కొత్త దంపతులు దేవాలయంలో పూజలు చేసారు. ఈ విషయం తెలుసుకున్న పూజారి కృష్ణమాచారి గుడి మైలపడిందని ఆగ్రహం చెందారు. హోమం జరిపి తిరిగి గుడిని పవిత్రం చేసేవరకు పూజలు చేయరాదని తలుపులు మూసివేసారు. ఊరికి శని పట్టుకుంటుందని, మాదిగలు గుడిలోకి వెళ్లటం చెడు శకునమని, ఇకముందు ఇలా జరగొద్దని పూజారి ప్రచారం చేసాడు. జనాభా పరంగా గ్రామంలో ఎక్కువగా ఉన్న బోయలు, పూజారి మాటలకు తలొగ్గి తమ ఆధిపత్యాన్ని చూపించారు. తాము అంటరానివారం కాదన్న అహంకారంతో మాదిగలను సామాజిక బహిష్కరణ చేసి వారిపై మోటార్ బైక్ లతో భౌతిక దాడులకు దిగబడ్డారు. కులం పేరుతో దుర్భాషలాడుతూ మానసికంగా హింసించారు. స్థానిక రెడ్డి ప్రోద్బలంతో మూడువందలమంది బోయలు మాదిగల వెంటబడి తరిమి కొట్టారు. మాదిగలకు నీటి సరఫరా అడ్డుకున్నారు. కిరాణా దుకాణాల్లో సరుకులు, హోటెల్స్ లో టీ కూడా వారికి అందకుండా చేసారు.
మాదిగలపై మొత్తం 17 సార్లు దాడులు జరిగాయి. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, రాజకీయ నాయకులు పాతపల్లి మాదిగలకు న్యాయం చేయలేదు. వీరందరిపై పోరాటం చేసేందుకు పాతపల్లి దళిత బాధితుల న్యాయపోరాట కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనమే తప్ప ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. బహుశా కొంతమంది బోయలు, స్థానిక రెడ్డి, బ్రాహ్మణ మాటలువిని మాదిగలపై దాడులు చేసిన వారిని జైలుకు పంపొచ్చు. జరుగుతున్న గొడవలపై స్థానిక బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ పూజారి మమ్మల్ని వాడుకుంటున్నట్టు కనిపిస్తుందని, మాదిగలను తిట్టడంపై విచారం వ్యక్తం చేసాడు. గొడవలు, పోలీసులు, కోర్టులు అంటూ తిరిగేందుకు ఓపిక, తన వద్ద అంత సొమ్ము లేదన్నాడు. దళితులు తమకంటే తక్కువ హోదాగలవారని బోయలు, ఇతర వెనుకబడిన కులాలవారు చూడటం తమను తాము దెబ్బతీసుకోవటమని, ఇది ఆధిపత్య సామాజిక వర్గాలవారికి ఉపకరించేదని తెలుసుకోవాలన్నారు.
x
Comments
Post a Comment